దేశంలో మరో రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలు గుర్తింపు..
|
భారతదేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల సంఖ్య 42కి చేరింది. తాజాగా మరో రెండు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించింది. నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశ్చిమబెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్‌కు కూడా చోటు దక్కింది. కాగా శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. అలాగే కర్ణాటకలోని హొయసల రాజవంశానికి చెందిన 13వ శతాబ్దపు దేవాలయాలకు కూడా యునెస్కో గుర్తింపు లభించింది. ప్రసిద్ధి చెందిన బేలూరులోని చన్నకేశవ ఆలయం, హళేబీడులోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయానికి కలిపి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇస్తున్నట్టు యునెస్కో వెల్లడించింది. సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతినికేతన్, హోయసలకు ఒక రోజు వ్యవధిలో యునెస్కో గుర్తింపు లభించడం గమనార్హం. దీంతో భారతదేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల సంఖ్య 42కి చేరుకుందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందులో సాంస్కృతిక విభాగంలో 34, సహజ విభాగంలో ఏడు, ఒక మిశ్రమ ఆస్తి ఉన్నాయని పేర్కొంది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|