ఇంత నిర్దయా?
|
ఆమదాలవలసలోని సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీలో ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల మూడు నుంచి ఆరోతేదీ వరకూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, నడవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు.. ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా.. గురువారం ఆమదాలవలస మునిసిపాలిటీలోని పలు సచివాలయాల్లో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల సచివాలయ ఉద్యోగులు ఉదయం 11 గంటల వరకు హాజరుకాలేదు. దీంతో వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించారు. అలాగే ఆమదాలవలస మునిసిపాలిటీ మోనింగివారివీధిలోని సచివాలయం- 1, 2 కేంద్రాల్లో కొంతమంది పింఛన్‌దారులు కుటుంబ సభ్యుల సాయంతో ఆటోలు, ద్విచక్రవాహనాలపై వచ్చి పింఛన్ తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులెవరూ పింఛన్‌దారుల ఇంటికి వెళ్లే దాఖలాలు కనిపించలేదు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|